సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో చేసే అసభ్య కామెంట్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలికాలంలో ఇటువంటి అసభ్య కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్లు షర్మిల, లక్ష్మీపార్వతి ఇదే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నటి పూనం కౌర్ కూడా కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. పూనం కౌర్ ఫిర్యాదులో పేర్కొన్న పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. వారి వ్యక్తగత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు రాస్తున్నారంటూ పోలీసులు వెల్లడించారు.
ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. అతడితో పాటు మరో వ్యక్తి ఈ నేరంలో భాగస్వామి అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్లు ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను సదరు నిందితులు రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే వెల్లడి అవుతుందని పోలీసులు చెప్పారు.