పనామా సెంటర్లో అటెన్షన్ డైవర్షన్ చేసి.. రూ. 58 లక్షలను దోచుకున్న చోర్‌గాళ్లు.. తమిళ కేటుగాళ్లే అని తేలిపోయింది. తిరుచ్చి రాంజీ గ్యాంగే ఈ చోరీ చేసినట్టు నిర్దారణ అయింది. ఈ చోర్‌గాళ్లను గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు.. తిరుచ్చి రాంజీ గ్యాంగ్‌గా నిర్దారించారు. కేటుగాళ్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన 20 బృందాలు నగరాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇక నిందితులను పట్టుకొనేందుకు తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక బృందం వెళ్లింది.
దోపిడీకి పాల్పడింది తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ తర్వాత దొంగలు పారిపోయిన మార్గాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ముఠా కోసం నగరం లోపల, వెలుపల మొత్తం 20 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. చోరీ అనంతరం దొంగలు విడివిడిగా నగరం వెలుపలకు వెళ్లి ఆతర్వాత జట్టుగా ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో సెక్యురిటీ గార్డు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. నగదు చోరీ తర్వాత దిల్‌సుఖ్ నగర్ వరకు దుండగులు ఆటోలో వెళ్లారు. అక్కడి నుంచి ఆటో మారి చాదర్‌ఘాట్‌కు వెళ్లారు. చాదర్ ఘాట్‌లో మరోసారి ఆటో మారి పరారైనట్టు గుర్తించారు. మొత్తం మూడు ఆటోలు మారినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక సులబ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి డబ్బును సంచుల్లోకి గ్యాంగ్‌సభ్యులు మార్చుకున్నారు. అనంతరం ఖాళీ పెట్టెను మలక్‌పేట దగ్గర పడేసి పరారయ్యారు. ఈ చోరీలో 5 నుంచి 8 మంది ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
చెక్ పోస్టులు, టోల్‌గేట్‌లను పోలీసులు అలర్ట్ చేశారు. గతంలోనూ రాంజీ గ్యాంగ్.. హైదరాబాద్‌లో పలుమార్లు దోపిడి చేసింది. దృష్టి మరల్చి దోపిడి చేయడంలో రాంజీగ్యాంగ్ దిట్ట. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్‌గా పేరున్న ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక దోపిడీలకు పాల్పడింది. బ్యాంకుల వద్ద తిష్టవేసి.. ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడింది. లక్షల రూపాయలను సర్దేసింది. ఇప్పటికే సౌత్ ఇండియా మొత్తాన్ని ఈ గ్యాంగ్ ఓ చూపు చూసింది. నార్త్‌లోనూ ఆడపాదడపా తమ చేతివాటాన్ని ప్రదర్శించింది.
హైదరాబాద్‌లోనూ చాలాసార్లు ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్టు కేసులున్నాయి. ఆ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న కేటుగాళ్లు.. ఈ సారి భారీ మొత్తంలో దోచుకెళ్లారు. ఈసారి ఎలాగైనా నిందితుల్ని పట్టుకోవాలనే పట్టుదలతో ఉంది పోలీస్‌శాఖ. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఆటకట్టించాలని భావిస్తోంది. అయితే బాధితుల దృష్టి మరల్చినట్టుగానే.. పోలీసుల అటెన్షన్‌ను కూడా డైవర్షన్ చేయడంలో ఈ గ్యాంగ్ పెట్టింది పేరు. అయితే నిందితులు ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి తీరుతామనే ధీమాతో ఉన్నారు పోలీసులు.