ముస్లింల ఇళ్లపై మూడు రంగుల జెండా: అసదుద్దీన్ పిలుపుకు అనూహ్య స్పందన

  • Publish Date - December 25, 2019 / 02:12 AM IST

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారీ బహిరంగ సభను నిర్వహించారు.  ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత మనం భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే భారతదేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

 
ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన వస్తోంది. హైదరాబాద్‌లో ముస్లింల ఇళ్లపై జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పాతబస్తీ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగరవేసి వారి దేశభక్తిని చాటుకుంటున్నారు. పాతబస్తీలోని చాంద్రయణగుట్ట, గోల్కొండ, కార్వాన్, లంగర్ హౌజ్‌లో ముస్లింల ఇళ్లపై రెండు రోజులుగా జాతీయ జెండాలు రెపరెపలాడుతూ ఉండడం కనిపిస్తోంది.

ఈ దేశం నాదా, కాదా అనేది నిర్ణయించడానికి మీరెవరని, భారత్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని.. దేశం ఒక హిందువులకు మాత్రమే సొంతం కాదని బీజేపీని ఉద్దేశించి అసదుద్దీన్ ప్రశ్నించారు. పోలీస్ తూటాలు తగిలినా.. ప్రతి ముసల్మాన్ హిందూస్థాన్ జిందాబాద్ అనడం మరువలేదని ఆయన అన్న మాటలను వాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ జెండాలను ఇళ్లపై ఎగురవేస్తున్నారు ముస్లింలు.

అసదుద్దీన్ పిలుపుతో తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఏర్పాటు చేసిన భాగ్యనగర ముస్లింలు.. వారి ఇళ్ల ఫోటోలు..