హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేత ఎవరు ? ఉత్తమ్…భట్టీల్లో ఎవరు ఉండనున్నారు ? ఇలాంటి సస్పెన్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరకు సీఎల్పీ నేతను ఢిల్లీలోనే ఎంపిక చేయనున్నారు. తమవల్ల కాదూ..మీరే ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికే అప్పగిస్తూ తీర్మానించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న ఏఐసీసీ ప్రత్యేక దూత.. నివేదికను అధిష్టానానికి పంపారు. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క అభ్యర్థిత్వానికే మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినా..ఇంకా కాంగ్రెస్ మాత్రం సీఎల్పీ నేత ఎంపికలో తర్జనభర్జనలు పడుతోంది.
హైదరాబాద్‌లో వాలిన ఢిల్లీ దూత…
సీఎల్పీ కావాలని చాలా మంది పోటీ పడుతుండడమే ఆలస్యానికి కారణం. చివరకు ఢిల్లీ నుండి ప్రత్యేక దూత హైదరాబాద్‌లో వాలారు. రాష్ట్రానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సీఎల్పీ రేసులో ఉన్న ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబులో ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం నివేదిక తయారు చేసి అధిష్టానానికి పంపారు. అయితే.. ఎమ్మెల్యేలంతా సీఎల్పీ లీడర్ ఎంపిక బాధ్యతను అధిష్టానానికే కట్టబెడుతూ తీర్మానం చేశారు.
తనకు సీఎల్పీ నేతగా అవకాశం కల్పించాలని కేసీ వేణుగోపాల్‌ను కోరినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్, సుధీర్‌రెడ్డిలు తెలిపారు. ముఖ్య పదవుల్లో ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురాలేక పోయిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
సీఎల్పీ నేత ఎంపికపై తుది కసరత్తు
హైకమాండ్ దూతగా వచ్చిన కేసీ వేణుగోపాల్
ఎమ్మెల్యేలతో వేణుగోపాల్ సమావేశం
సీఎల్పీ లీడర్ ఎంపిక బాధ్యతను..
రాహుల్‌కు కట్టబెడుతూ ఏకగ్రీవ నిర్ణయం
రేస్‌లో ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు..ఇతర సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుంటున్న ఢిల్లీ అధిష్టానం భట్టి వైపే మొగ్గు చూపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. భట్టికి గతంలో అసెంబ్లీ డిప్యూటి స్పీకర్, చీఫ్ విప్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మరి రాహుల్‌గాంధీ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
2018 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లల్లో గెలుపొందింది.