చల్లని కబురు : రెండు రోజులూ వర్షాలు

  • Publish Date - May 13, 2019 / 01:54 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే..వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మే 11వ తేదీన పలు జిల్లాల్లో వర్షం కురిసింది. తాజాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.

దక్షిణ కర్ణాటకపై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు..రాయలసీమ నుంచి శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయని..అందుకే వాతావరణం చల్లబడుతోందని వాతావరణ శాఖాధికారులు వెల్లడిస్తున్నారు. మే 13 సోమవారం, మే 14 మంగళవారం రోజుల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో ఒక మాదిరి వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.