Hyd to Vizag : క్యాబిన్‌లో దూరిన ఎలుక.. 12 గంటలు ఆలస్యంగా విమానం

  • Publish Date - November 12, 2019 / 10:00 AM IST

ఎయిర్ ఇండియా విమానంలో ఎలుక అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే విమానంలోకి ఎలుక దూరింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది.

విమాన సిబ్బంది క్యాబిన్‌లోకి ఎలుక వెళ్లడంతో 12 గంటలు ఆలస్యంగా విమానం బయల్దేరింది. అందిన రిపోర్టు ప్రకారం.. షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా విమానం ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయల్దేరాల్సి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు వైజాగ్ చేరుకోవాలి. 

విమానం బయల్దేరడానికి ముందే క్యాబిన్ లోకి ఎలుక ప్రవేశించినట్టు సిబ్బంది ఒకరు గుర్తించారు. వెంటనే ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్‌‌కు సమాచారం అందించారు. ఎయిర్ ఇండియా అధికారులు వెంటనే స్పందించి విమానం మొత్తాన్ని తనిఖీ చేయించారు. ఎలుక కారణంగా విమానానికి ఏమైనా డ్యామేజ్ అయిందా? చెక్ చేశారు. ఈ క్రమంలో ప్రయాణికులు గంటల కొద్ది ఎయిర్ పోర్టులోనే ఎదురుచూడాల్సి వచ్చింది.

దీంతో వైజాగ్ వెళ్లే ప్రయాణికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. సుమారు 12 గంటల తర్వాత ఎయిర్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చింది. విశాఖపట్నంలో విమానం ల్యాండ్ అయ్యాక అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరింది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ నెలలో జెడ్డాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 350 ప్రయాణికులతో వెళ్లాల్సిన విమానం.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో గంటల పాటు నిలిచిపోయింది.