Hyderabad Municipal Act: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త మున్సిపల్ చట్టం.. ఒక్క బిల్లులోనే పన్నులు, నీటి ఛార్జీలు!
హైదరాబాద్(Hyderabad Municipal Act) నగర ప్రజలకు మున్సిపల్ సేవలను సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- October 4, 2026 / 08:21 PM IST
Revanth Reddy government implemented new municipal act in Hyderabad.
Hyderabad Municipal Act: భారతదేశంలోనే వేగంగా విస్తరిస్తున్న మహానగరాల్లో ఒకటైన హైదరాబాద్(Hyderabad Municipal Act) నగర ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో రూపొందించిన నూతన మున్సిపల్ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చింది. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ క్యూర్ (CURE) అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ద్వారా జీహెచ్‌ఎంసీ, పోలీస్, హెచ్‌ఎండీఏ, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ మరియు హైడ్రా వంటి కీలక శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి నగర పాలనలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుట్టారు.
ఆటోమేటిక్ మ్యూటేషన్.. ‘క్యూర్-1’ పేరుతో సింగిల్ బిల్లు:
కొత్త చట్టంతో ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆటోమేటిక్ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఆస్తికి ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ కేటాయించనున్నారు. ఇకపై ఆస్తిపన్ను, నీటి బిల్లు, మురుగునీటి ఛార్జీలు, పారిశుద్ధ్య బకాయిలన్నింటికీ కలిపి ‘క్యూర్–1’ పేరుతో ఒకే సమగ్ర బిల్లు జారీ చేస్తారు. ఆస్తిపన్నును గైడ్‌లైన్ విలువ ఆధారంగా లెక్కిస్తారు. పన్ను పెంపు ఏటా గరిష్ఠంగా 10 శాతానికి మించకుండా పరిమితి విధించి ప్రజలపై అదనపు భారం పడకుండా జాగ్రత్త వహించారు.
రోడ్డు తవ్వకాలకు కోఆర్డినేషన్.. భవన అనుమతులకు డీమ్డ్ అప్రూవల్:
నగరంలో ఒక శాఖ నిర్మించిన రోడ్డును మరొక శాఖ వెంటనే తవ్వే దుస్థితికి చెక్ పెడుతూ యుటిలిటీ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. భవన అనుమతుల కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా, నిర్ణీత సమయంలో అనుమతులు రాకపోతే చట్టబద్ధమైన డీమ్డ్ అప్రూవల్ సౌలభ్యం కల్పించారు. చిన్న చిన్న ఉల్లంఘనలకు క్రిమినల్ కేసుల స్థానంలో సివిల్ జరిమానాలు విధిస్తారు. చెరువులు, నాలాలు, పార్కుల రక్షణకు హైడ్రాకు పూర్తి స్థాయి చట్టబద్ధ అధికారాలు కల్పిస్తూ కఠిన చర్యలకు మార్గం సుగమం చేశారు.
70 ఏళ్ల నాటి పాత నిబంధనలకు స్వస్తి.. సామాజిక భద్రతకు ప్రాధాన్యం:
1955 నాటి పాత చట్టంలో ఉన్న కాలం చెల్లిన టాంగాలు, ఎద్దుల బండ్ల పన్నులు, ఆక్ట్రాయ్ వంటి 100కు పైగా నిబంధనలను పూర్తిగా రద్దు చేశారు. మహానగర రక్షణ, విపత్తు నిర్వహణ కోసం క్యూర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు, నగరంలో జెండర్ ఇన్‌క్లూజన్ సెల్, గిగ్ వర్కర్ల కోసం విశ్రాంతి ప్రాంతాలు, వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ చట్టం నగర నివాసితులకు మెరుగైన జీవిత ప్రమాణాలను అందించనుందని అధికారులు స్పష్టం చేశారు.
