నగరంలో హెల్మెట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. దుకాణాల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నూతన రోడ్డు భద్రతా చట్టం 2019, సెప్టెంబర్ 01 నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హెల్మెట్‌లు కొనుగోలు చేయడానికి పరుగులు పెడుతున్నారు జనాలు. క్యాష్ చేసుకోవడానికి కొంతమంది దుకాణ దారులు అమాంతం ధరలు పెంచేశారు. అంతేగాకుండా నకిలీ హెల్మెట్‌లు కూడా ఎంట్రీ ఇచ్చేశాయి.
హెల్మెట్ లేకుండా బండి నడిపితే..కొత్త చట్టం ప్రకారం రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే ఛాన్స్ ఉంది. దీంతో వాహనదారులు అలర్ట్ అయ్యారు. కొంతమంది వాహనదారులు తక్కువ ధరలో లభిస్తాయని రోడ్డు పక్కన విక్రయించే హెల్మెట్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటివి కొనుక్కొంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాణ్యత లేని, నకిలీ హెల్మెట్లు వినియోగించవద్దంటున్నారు. నాణ్యమైన, బ్రాండెడ్ హెల్మెట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. బీఐఎస్ ఆమోదించిన హెల్మెట్‌లను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావించింది.
కానీ నిబంధనలు అమలుకు నోచకుండానే కొత్త చట్టం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా 219 బ్రాండెడ్ కంపెనీలు హెల్మెట్‌లను తయారు చేసి విక్రయిస్తుండగా..ఇప్పటి వరకు కేవలం 9 కంపెనీలకు మాత్రమే బీఐఎస్ ఆమోదం లభించినట్లు రోడ్డు భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్నా..బీఐఎస్ ధృవీకరణ మాత్రం ఇంకా లభించలేదు. ఇప్పటికిప్పుడు బీఐఎస్ ఆమోదం లభించకపోయినా..బ్రాండెడ్ హెల్మెట్‌లను ధరిస్తే సేఫ్ ఉంటుందని రవాణా అధికారులు సూచిస్తున్నారు.
బ్రాండెడ్ కంపెనీలకు చెందినవి ఐఎస్ఐ మార్క్ ఉన్నవి సురక్షితమైన హెల్మెట్‌లు. స్టడ్స్, రాంగ్లర్, టీహెచ్‌హెచ్, రాయల్ ఎన్ ఫీల్డ్, వెగా, స్టీల్ బర్డ్, ఎల్ ఎస్ -2, వంటి కంపెనీలకు చెందిన హెల్మెట్‌లు ధరించవచ్చని సూచిస్తున్నారు. పలు సంస్థలు హాఫ్ హెల్మెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇవి అంత సేఫ్ కావంటున్నారు. నాణ్యమైన హెల్మెట్ ధర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రూ. 1200 నుంచి రూ. 3000 వరకు ఉంటుంది.