నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను నిలిపివేయాలి

  • Publish Date - September 16, 2019 / 03:33 PM IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే  నిలిపి వేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసింది.  నల్లమలలో సర్వే కోసం ఇప్పటికే ఇచ్చిన ఇతర అనుమతులను కూడా రద్దుచేయాలని, భవిష్యత్తులో కూడా యురేనియం సర్వేకు, తవ్వకానికి ఎటువంటి  అనుమతులు ఇవ్వరాదని కోరింది.  

సోమవారం తెలంగాణ అసెంబ్లీలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని ఆహ్వానిస్తూనే… తీర్మానం అసంపూర్తిగా ఉందని దీనిపై ప్రభుత్వం నుంచి సమగ్రమైన వివరణ కోరాలని తీర్మానించారు. కడపజిల్లా తుమ్మలపల్లిలో జరుగుతున్న యురేనియం మైనింగ్ను తక్షణం ఆపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. గతంలో తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో చేపట్టిన యురేనియం అన్వేషణ తీరు వల్ల  ప్రజలకు అపార నష్టం జరిగిందని…. అందువల్ల అఖిల పక్ష తీర్మానాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు, రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కోదండరాం, చెరుకు సుధాకర్‌ తో సహా పలు స్వచ్చంద సంస్ధల నాయకులు, సైంటిస్టులు, నల్లమలవాసులు, ఉద్యమకారులు పాల్గోన్నారు.