హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ బహిరంగ సభలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది స్వార్థం కోసం జనం మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. సంఘ్ కార్యకర్తలు ప్రపంచ విజయాన్ని కోరుకుంటారన్నారు. సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ స్వార్థం కోసం ఆలోచించరన్నారు. దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని భగవత్ తెలిపారు.
కొంతమంది ఆర్ఎస్ఎస్ ను తప్పుగా ఊహించుకుంటున్నారని,దేశాన్ని శుద్ది చేయడం కాంట్రాక్టర్ల వల్ల కాదని భగవత్ అన్నారు. విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించగలవన్నారు. విలువలు మన ప్రవర్తనను నిర్ణయిస్తాయన్నారు. విలువలు పోగొట్టుకుంటే తిరిగిరావన్నారు. దేశం భిన్నత్వంలో ఏకత్వమే కాదు ఏకత్వంలోనూ భిన్నత్వాన్ని చూపిస్తోందన్నారు. సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది స్వలాభం కోసం ప్రజల మధ్య విబేధాలు సృష్టిస్తారని,ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే వారు ప్రమాదకరమని భగవత్ అన్నారు. అందరూ సమానమనే భావన ఉండాలన్నారు.