ట్యాంకు బండ్ పై శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది.
గత 36 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మికుల జేఏసీ అఖిలపక్ష నేతలతో కలిసి శనివారం ఛలో ట్యాంకు బండ్ కు పిలుపు నిచ్చింది. ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శుక్రవారం రాత్రి నుంచే పలువురు జేఏసీ నేతలను, అఖిలపక్షనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు నాయకులను హౌస్ అరెస్టు చేశారు.
శనివారం తెల్లవారుఝూమునుంచే ట్యాంక్ బండ్ కు వెళ్లే అన్ని రహాదారులును మూసివేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం లోపు ట్యాంక్ బండ్ చేరుకుంటామని కార్మికులు తెలిపారు. వందలాది మంది పోలీసుల వలయాన్ని చేదించుకుని శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులు నిరసన తెలుపుతూ అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పైకి దూసుకువచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు.