ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు మాత్రం రోజుకో ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం అన్ని డిపోల దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు కార్మికులు.
ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఆందోళనలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై కార్మికుల భగ్గుమంటున్నారు. పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. నగరంలో జరిగే ధర్నాలో అఖిలపక్ష నేతలు పాల్గొననున్నారు. మరోవైపు సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనల కార్యాచరణ పూర్తి కావడంతో తదుపరి కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది.
ఆదివారం జేఏసీ నేతలు సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమం నేపథ్యంలో కొందరు జేఏసీ నేతలను పోలీసులు శుక్రవారమే అదుపులోకి తీసుకొన్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితోపాటు ఇతర ముఖ్యులను ట్యాంక్‌బండ్ సమీపంలో శనివారం అరెస్టు చేసి రాత్రికి విడుదల చేశారు. దీంతో కొత్త కార్యాచరణ ఖరారుపై జేఏసీ నేతలు భేటీ కాలేకపోయారు. ఆదివారం అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది.
Read More : మిలాద్ ఉన్ నబీ : పాతబస్తీలో దారి మళ్లింపు