ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో ప్రభుత్వం..ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఆర్టీసీ కార్మికులకు సంస్థ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ నోటీసులు (అక్టోబర్ 04వ తేదీ శనివారం) జారీ చేశారు. సమ్మెకు దిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు అన్ని బస్ డిపోలకు నోటీసులు పంపించారు అధికారులు. త్రిసభ్య కమిటీ నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదన్న జేఏసీ నేతలు… కార్మికులంతా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది త్రిసభ్య కమిటీ. 2100 అద్దె బస్సులను నడుపుతామని, 3 వేల మంది డ్రైవర్లను నియమిస్తామని వెల్లడించింది. తాత్కాలిక అనుమతులతో స్కూల్ బస్సులను రహదారురలపై తిప్పుతామని, పోలీసు రక్షణలో అద్దె బస్సులను నడుపుతామని వెల్లడించారు త్రిసభ్య కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించినట్లు, 26 అంశాలపై నివేదిక రూపొందించాల్సి ఉందని..రాతపూర్వక హామీ ఇవ్వాలని కార్మిక నేతలు కోరినట్లు తెలిపారు. పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం సరికాదని వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన దానికంటే ఆర్టీసీకి ఎక్కువ నిధులు ఇచ్చామనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు యత్నించాలని, సమ్మెకు వెళితే..ఆర్టీసీకి మరింత ఆర్థిక నష్టం వస్తుందని చెప్పారు. ఎస్మా చట్టం ప్రకారం సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధమన్నారు.
మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మికుల డిమాండ్లకు.. ప్రభుత్వం చెబుతున్న విషయాలకు మధ్య పొంతన కుదరడం లేదు. శుక్రవారం(అక్టోబర్ 4,2019) ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. చర్చలను బహిష్కరించిన కార్మిక సంఘాలు సమావేశం నుంచి బయటకు వచ్చేశాయి. శనివారం(అక్టోబర్ 05,2019) నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని జేఏసీ ప్రకటించింది.
Read More : చర్చలు విఫలం : సమ్మెకు వెళ్తామన్న ఆర్టీసీ కార్మికులు