ఏం జరుగబోతోంది : ఆర్టీసీ జేఏసీ నేతలకు చర్చల పిలుపు

  • Publish Date - October 26, 2019 / 06:05 AM IST

చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.శ్రీనివాసరావు, వాసుదేవరావుకు ఆహ్వాన లేఖలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు అందచేశారు. ఉన్నతాధికారులతో చర్చలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో చర్చలు స్టార్ట్ కానున్నాయి. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశం కానున్నారు. అధికారుల సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. 

ఆర్టీసీ సమస్యలపై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈడీల కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. కమిటీ స్టడీ చేసి నివేదికను సంస్థ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మకు అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఉదయం సమర్పించింది. దీనిని రవాణ మంత్రికి అందచేశారు. మంత్రి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించారు. మొత్తంగా చర్చలకు సీఎం కీసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆర్టీసీ విలీనం ప్రస్తావన లేకుండా ఆర్థిక భారం లేని అంశాలపై సంఘాలతో చర్చలు జరుపాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

ఆర్టీసీ సమ్మె 22 రోజులకు చేరుకుంది. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు పట్టుదలకు వెళ్లడంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ముందు నుంచి చెబుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే..ఆర్టీసీ విలీన అంశమే పీఠముడిగా మారే అవకాశం కనిపిస్తోంది. రుపక్షాలు ఎవరి పట్టుదలలో వారున్న నేపథ్యంలో జరగనున్న చర్చల్లో ఎలాంటి పురోగతి సాధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చర్చలు పూర్తిస్థాయిలోజరుగుతాయా? లేదంటే… కోర్టు సూచించినట్టుగా 21 అంశాలపైనే జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. 
Read More : పండుగ వేళ : శివార్లలో విపరీతమైన రద్దీ..ప్రయాణీకుల కష్టాలు