సంక్రాంతి సందడి : టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం 

  • Publish Date - January 11, 2020 / 09:26 AM IST

హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగకు నగరం నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారితో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు.  మరోవైపు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి. 
 

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ గేట్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో 8 టోల్‌ బూతులు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్‌ ట్యాగ్‌ స్కానర్‌ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్‌ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్‌లను తీసుకుంటున్నారు. 

మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్దీగా బాగా ఉంది. గంటగంటకు హైవేలపై వాహానాల రద్దీ పెరిగుతోంది. టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్‌, విజయవాడ 65 నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు.  కొన్ని టోల్ ప్లాజాల వద్ద  వాహానదారులు అసహనానికి గురవుతున్నారు. ఫాస్ట్ ట్యాగ్ తగిలించుకున్నా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క టోల్ప్లాజా వద్దే దాదాపు అరగంట సమయం వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

తెలంగాణలో ఆదివారం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా  నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. ప్రస్తుత టోల్ గేట్ల వద్ద పరిస్ధితి చూస్తుంటే శనివారం రాత్రి నుంచి ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆదివారం మరింత ఎక్కువవుతుంది. 

 

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 
మరోవైపు, ఆర్టీసీ  అధికారులు సంక్రాంతి పండుగ  సందర్భంగా 4,940 స్పెషల్‌ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసారు. జూబ్లీ బస్‌స్టేషన్‌, ఎంజీబీఎస్ సహా నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు.. ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ, లింగంపల్లి, చందానగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌, ఎల్‌బీ నగర్‌, అమీర్‌పేట, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, దిల్‌సుఖ్‌ నగర్‌ తదితర ప్రాంతాల నుంచి జనవరి10,శుక్రవారం నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపుతున్నారు.