హైద‌రాబాద్ లో న‌ల్లా క‌నెక్ష‌న్ కోసం ప్ర‌త్యేక క్యాంప్ లు

  • Publish Date - May 7, 2019 / 04:45 AM IST

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ఔటర్‌ గ్రామాల్లో  కొత్త నల్లా కనెక్షన్ల జారీకి  ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్‌ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.  సోమవారం ఖైరతాబాద్‌లో జలమండలి లో తాగునీటి పథకాల పురోగతిపై ఆయన సమీక్ష నిర్విహించారు. హడ్కో, ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుల్లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న గ్యాపులు, జంక్షన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని దానకిషోర్ ఆదేశించారు.

తాగునీటి పధకాల కింద నూతన నల్లా కనెక్షన్ల జారీపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2వేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లను రోడ్డుకు సమాంతరంగా సరిచేసే ప్రక్రియపై సంబంధిత సీజీఎంలు, జీఎంలతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు.  మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.