పండుగ వేళ : శివార్లలో విపరీతమైన రద్దీ..ప్రయాణీకుల కష్టాలు

  • Publish Date - October 26, 2019 / 02:14 AM IST

నగరంలో ప్రయాణీకుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పండుగ వేళల్లో ఎంజీబీఎస్, జూబ్లి బస్ స్టేషన్లు ప్రయాణీకులతో సందడిగా కనిపించేది. ప్రస్తుతం బోసిపోతున్నాయి. నగర శివార్లకు రద్దీ మారిపోయింది. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దసరా పండుగకు దూర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు అరకొరగా ఉండడంతో ప్రైవేటు వాహనాల వైపు మొగ్గు చూపారు. దసరాకు ఇలాగే వెళ్లారు. ఇప్పుడు దీపావళికి అదేమాదిరి ఆశ్రయిస్తున్నారు. వారంతం కావడంతో..నగర వాసులు అనేక మంది అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం బయలుదేరారు. 

ఎల్బీనగర్, ఆరాంఘర్, లింగంపల్లి, బాలానగర్, ఉప్పల్, గచ్చిబౌలి, జూబ్లి బస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఖమ్మం, విశాఖపట్టణం, కర్నూలు, కడప, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో శివారు ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దండుకుంటున్నారు. విజయవాడకు రూ. 1000 డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రూటును బట్టి..రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తండడంతో ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. ఏసీ ఉంటే..రూ. 2 వేలు, ఏసీ కాకుంటే..రూ. 1500 తీసుకుంటున్నారని వాపోతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు కూడా కిటకటలాడుతున్నాయి. 
Read More : ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు