ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం పొందుపరిచిన హామీలు అమలులోకి తీసుకరావాలని కోరుతూ మరోసారి తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖను కోరింది. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్ఫాల్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో జరిగిన సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరపున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఢిల్లీలో తెలంగాణ భవన్ ఇన్ ఛార్జీ రెసిడెంట్ కమిషనర్ వేదాంత గిరి, ఏపీ తరపున ఉన్నతాధికారులు హాజరయ్యారు. చట్టంలోని పెండింగ్ అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి ? ఇంకా పెండింగ్‌లో ఉన్నవి ఏమిటో ? తెలియచేయాలని ఇరు రాష్ట్రాల అధికారులకు సూచించింది.
విభజన చట్టంలోని సెక్షన్ 93 ప్రకారం తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన సంస్థలు, కేంద్ర సహకారం అంశాలపై తెలంగాణ అధికారులు వివరించారు. షెడ్యూల్ 13లో పొందుపరిచిన ఆరు అంశాలపై సమావేశంలో చర్చించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, సిద్ధిపేట జిల్లా ములుగులో ఉద్యానవన విశ్వ విద్యాలయాల ఏర్పాటును వేగవంతం చేయడానికి అవసరమైన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద వచ్చిన నిధులన్నీ ఏపీ తన ఖాతాలో వేసుకుందని తెలంగాణ అధికారులు హోం శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను వెంటనే విభజించాలన్నారు. అయితే..ఇక్కడ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.