రేపటి నుండి మండనున్న ఎండలు

  • Publish Date - April 24, 2019 / 01:11 AM IST

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నుండి ఎండలు అధికమవుతాయని తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక కొమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 1.5 కి.మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణ మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి బలహీన పడిందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ పీడనం తుపాన్‌గా మారే అవకాశం ఉందని..దక్షిణ తమిళనాడును తాకే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై ఉండకపోవచ్చని వెల్లడించారు. 

ఇదిలా ఉంటే…తెలుగు రాష్ట్రాలలో అకాలవర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో చేతికి అందివస్తాయనుకున్న పంటలు నేల పాలయ్యాయి. మామిడి, అరటి, వరి, జీడిమామిడి పంటలకు తీరని నష్టం జరగడంతో.. రైతులు లబోదిబోమంటున్నారు.  మరోవైపు పలుప్రాంతాల్లో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు