హైదరాబాద్ : రెంటికీ చెడ్డ రేవడి అయింది ఫిరాయింపు ఎమ్మెల్సీల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు నలుగురు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం..అటు పార్టీ ఫిరాయింపుపై టీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఉన్న పదవి ఊడిపోయింది. టీఆర్ఎస్ ఫిర్యాదుపై పలు దఫాలుగా విచారణ జరిపిన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీలపై వేటు వేశారు. యాదవరెడ్డి, భూపాల్‌రెడ్డి, రాములు నాయక్ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేశారు. కొండా మురళి గతంలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
వేటుపై స్పందన…
మండలి ఛైర్మన్ తనకు నోటీసులు పంపడం చట్టాన్ని వెక్కిరించినట్లుగా, చట్టాన్ని తిట్టినట్టుగా, అవహేళన చేసినట్టుగా ఉందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఆరోపించారు. ఒక పార్టీలో చేరితే ఒక రియాక్షన్.. మరోపార్టీలో చేరితే మరో రియాక్షన్ అన్నట్లుగా మండలి తీరు ఉందని ఆయన ఆరోపించారు.
మండలి ఛైర్మన్ నుండి తనకు అందిన నోటీసును ఓ గొప్ప బహుమతి అనుకుంటున్నానని అన్నారు ఎమ్మెల్సీ రాములు నాయక్. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. ఒక ఉద్యమ కారునికి కేసీఆర్ ఇచ్చిన బహుమతిగా తాను అనుకుంటున్నానన్నారు.
తెలంగాణలో ఈరోజు తనకు చీకటి రోజు అని అన్నారు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి. ఇది ఏకపక్ష నిర్ణయం.. చట్టానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన విమర్శించారు. నోటీస్ అంతా తప్పులతడకగా ఉందని భూపతి రెడ్డి చెప్పారు.