ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగానే..తమ సమస్యలు పరిష్కరించాలని టి.ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఉద్యోగుల సంఘం జేఏసీ మద్దతు తెలిపింది. డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతామని జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో అక్టోబర్ 17వ తేదీ గురువారం వీఆర్కే భవన్‌కు తెలంగాణ ఉద్యోగుల సంఘ జేఏసీ నేతలు వచ్చారు. అక్కడ సీఎస్ ఎస్‌కే జోషిని కలిశారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కొంతకాలంగా వీరు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీఏ, పీఆర్సీ, హెచ్ఆర్‌ఏ, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు, ఇతరత్రా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీఎస్ జోషితో భేటీ సందర్భంగా ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, వారితో చర్చలు జరుపాలని జేఏసీ నేతలు కోరారు.
ఆర్టీసీ సమ్మె జరుగుతుండగానే..ఇటీవలే సీఎంను ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు కలవడం చర్చకు తెరలేపింది. సీఎంను కలవడం..తమ సమస్యలను విన్నవించడంలో ఎలాంటి తప్పు లేదని జేఏసీ నేతలు సమర్థించుకున్నారు. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందన వచ్చిందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అనంతరం దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారని వెల్లడించారు. మరి వీరి డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా ? లేదా ? చూడాలి.
Read More : ఏం జరుగనుంది : ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా