హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ అడుగు పెట్టబోతోంది. ఇందుకు పక్కా ప్లాన్ సిద్ధమైపోతోంది. టీఆర్ఎస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ అందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన తలసాని.. ఓ భారీ బహిరంగ సభ పెట్టేందుకు రెడీ అయిపోయారు. అంతేకాదు.. ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బీసీ, యాదవ సంఘాలను ఐక్యం చేస్తూ ముందుకెళుతున్నారు. అందులో మార్చి3న గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో యాదవ బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించి సంచలన రేపారు.
ఫిబ్రవరి 14వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మంచి తీర్పు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించే పథకాలు మార్చి నెల వరకే అని.. పథకాలు అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవన్నారు. ఏపీ రాష్ట్రంలో తనను కలిసిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని.. నేను వస్తుంటే ఏపీ పోలీసులు కండీషన్స్ పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తలసాని. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు సరికాదని హితవు పలికారు. టీడీపీ నేతలు తెలంగాణకు వచ్చి స్వేచ్చగా ప్రచారం చేయలేదా అని గుర్తు చేశారు.
రెండు నెలల్లో కార్పొరేషన్లు పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పప్పు బెల్లాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారని నిలదీశారు. తలసాని చేపట్టే టూర్..మీటింగ్‌లపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.