సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు: 37వ వసంతంలోకి టీడీపీ

  • Publish Date - March 29, 2019 / 02:54 AM IST

సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ 37వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిని.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పిన ఎన్టీఆర్‌.. టీడీపీని 1982 మార్చి 29న స్థాపించారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు, సవాళ్లకు, సంక్షోభాలకూ కేంద్రబిందువుగా నిలిచింది టీడీపీ. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను కంగుతినిపించి అధికారంలోకొచ్చిన టీడీపీ ప్రజాభిమానాన్ని చూరగొంటూ.. ఎన్నో చరిత్ర పుటల్ని తన పేరిట లిఖించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరు గడించిన ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులు టీడీపీ నుంచే వారి ప్రస్థానం ప్రారంభించారు.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక చిన్న గదిలో ఆరంభమైంది. వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు మానసపుత్రికగా టీడీపీ ఆవిర్భవించింది. పార్టీ స్థాపించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయంగా 30 ఏళ్లపాటు తట్టుకొని నిలబడ్డ ప్రాంతీయ పార్టీగా  తెలుగుదేశం చరిత్ర సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ తనదైన పాత్రను విజయవంతంగా పోషించింది. ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు టీడీపీని ఉన్నతస్థాయికి తీసుకెళ్లారు. అయితే 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల పాటు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది సైకిల్ పార్టీ. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించకుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనుకుంటున్న సమయంలో.. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకుని వచ్చింది.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

ఉమ్మడి రాష్ట్రంలో విభజనపై ఏదో ఓవైపు మొగ్గు చూపాల్సిన తరుణంలోనూ సమతుల్యత విధానం పాటించిన తెలుగుదేశం.. విభజన తర్వాత దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సునాయాస విజయాన్ని అందుకున్న టీడీపీ.. తెలంగాణాలో మాత్రం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నాయకత్వం అభివృద్ధి చేసుకునే పనిలో పడింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల మధ్యే.. ప్రజలతోనే మమేకమన్న విధానం తెలుగుదేశం పంథా. అయితే చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరన్న అంతర్మథనం పార్టీ నేతలు, కార్యకర్తల్లో నెలకొంది. చంద్రబాబు తనయుడు నారా లోకేషే తమ భవిష్యత్ నేత అన్న అభిప్రాయమూ పార్టీలో వ్యక్తవుతోంది.

ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఏపీలో సభ్యత్వాన్ని 50 లక్షలకు పైగా తీసుకెళ్లిన ఘనతనూ లోకేశ్ సొంతం చేసుకున్నారు. రాజకీయ పరమైన లక్ష్యాలతోనే కాకుండా సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుటుంబసభ్యులంతా ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తమ వంతు సేవలందించటంలో కలసికట్టుగా కృషి చేస్తున్నారు.
Read Also : లైన్ క్లియర్: థియేటర్‌లలో లక్ష్మీ’స్‌ ఎన్‌టీఆర్.. ఫస్ట్ టాక్ ఇదే!

అలాగే నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం.. పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలాంటి కార్యక్రమాలు చేపడుతూ టీడీపీ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా పార్టీ కోసం పనిచేసి.. ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల కోసం ఉచిత విద్య అందిస్తున్న ఏకైక ప్రాంతీయపార్టీ టీడీపీ మాత్రమే. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో 36 ఏళ్లుగా సేవలందిస్తున్న టీడీపీ 37వ వసంతంలోకి అడుగుపెట్టింది.
Read Also : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్