నేడూ వడగాలులు – ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు

  • Publish Date - May 1, 2019 / 01:56 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతమౌతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడతో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణలో మే 01వ తేదీ బుధవారం వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం పలు ప్రాంతాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్‌లో 45.3 టెంపరేచర్ నమోదై..పదేళ్ల రికార్డును దాటింది. నిజమాబాద్‌లో 43.8, నల్గొండలో 43.2, మెదక్‌లో 42.8, భద్రాచలం, రామగుండం 42.6 డిగ్రీలు, హన్మకొండలో 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మే 01, మే 02వ తేదీల్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రెండు రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.