అసెంబ్లీ టైమ్ : గవర్నర్‌ ప్రసంగం

  • Publish Date - January 19, 2019 / 02:33 AM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు కొనసాగుతున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరిగాయి. ఇక మూడో రోజు (జనవరి 19వ తేదీ) ఉభయ సభలనుద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటుందో గవర్నర్‌ ప్రసంగంలో చెప్పనున్నారు. 
ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ అసెంబ్లీకి చేరుకుంటారు. దాదాపు 40 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక ఈ ప్రసంగంలో రాష్ట్రం ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర వృద్ధిరేటు పెరుగుదల, ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, యావత్‌ దేశం తెలంగాణ అమలు చేస్తున్న పథకాలను అమలు చేస్తున్న తీరును వివరిస్తారు.
ప్రసంగంలో వివిధ అంశాలు…
ఇక గవర్నర్‌ ప్రసంగంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన విధానం,.. రైతుబంధు, రైతుబీమాకు ఐక్యరాజ్యసమితి అవార్డు ఇచ్చిన విషయాన్ని కూడా పొందుపర్చారు. సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసిన విషయంతో పాటు.. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీరుకు మిషన్‌ భగీరథ, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ ముందు ఉంచనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు..నెరవేర్చడంలో సర్కార్ తీసుకుంటున్న చర్యలను కూడా గవర్నర్ ప్రస్తావించనున్నారు. సంక్షేమంతోపాటు.. సాగునీటి ప్రాజెక్టులు, కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే యజ్ఞం ప్రభుత్వం ముందున్న విషయాన్ని గవర్నర్‌ ప్రసంగంలో చేర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి పెన్షన్‌ పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగుల రిటైర్డ్‌ వయో పరిమితి పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లాంటి అంశాలు కూడా ఈ ప్రసంగంలో ఉండబోతున్నాయి. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన అనంతరం సభ వాయిదా పడుతుంది. 
Read More : అభివృద్ధిలో తెలంగాణ ముందంజ : గవర్నర్ స్పీచ్ హైలెట్స్