పండగే పండగ : సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటన

  • Publish Date - September 19, 2019 / 06:16 AM IST

సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి కార్మికుడికి లక్ష(రూ.లక్షా 899) బోనస్ ఇస్తామన్నారు. అలాగే లాభాల్లో ప్రతి ఒక్కరికి 28శాతం వాటా ఇస్తామన్నారు. గురువారం(సెప్టెంబర్ 19) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి చాలా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సంస్థాగతంలో బలోపేతమైందని, అందులో పనిచేస్తున్న వారందరూ బాధ్యతతో పనిచేస్తుండడంతో రికార్డు స్థాయి ఉత్పత్తి జరుగుతోందన్నారు. 2013-14లో సంస్థలో 50.47 మిలియన్ టన్నులు, గత ఐదేళ్లలో ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తోందని కేసీఆర్ చెప్పారు.

2018-19లో బొగ్గు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 64.14 మిలియన్ టన్నులకు చేరుకుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ఆదాయం పెరుగుతూ వస్తోందని, 2018-19 సంవత్సరానికి రూ. 17 వందల 65 కోట్లు గరిష్ట లాభాన్ని గడిచిందన్నారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకం, లాభాలు, టర్నోవర్‌లో సింగరేణిలో సాధిస్తున్న ప్రగతి.. ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. కోల్ ఇండియాతో పోలిస్తే..సింగరేణి ఎంతో మెరుగ్గా ఉందన్నారు. కార్మికులు పడుతున్న శ్రమ వెలకట్టలేనిది అని సీఎం అన్నారు. 

2013-14 సంవత్సరంలో రూ. 13 వేల 554 బోనస్ గత ప్రభుత్వం ఇచ్చిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత..ఐదేళ్లలో కార్మికులకు ఇచ్చే బోనస్ పెంచుతూ వస్తోందని కేసీఆర్ గుర్తు చేశారు. 2017-18లో లాభాల్లో 27 శాతం వాటాగా ఒక్కో కార్మికుడికి 60 వేల 369 రూపాయలు చెల్లించిందన్నారు. 2019లో…లాభాల్లో వాటాను 28 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల లక్షా 899 రూపాయల బోనస్ వస్తుందని తెలిపారు. 2018 కన్నా రూ.40 వేల 530 అదనంగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న కానుక అని వెల్లడించారు.