ఇక లాంఛనమే : స్పీకర్‌గా పోచారం

  • Publish Date - January 18, 2019 / 12:43 AM IST

హైదరాబాద్ : తెలంగాణ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి పోచారం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. జనవరి 18వ తేదీ శుక్రవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. అసెంబ్లీ తొలిరోజు సమావేశాల తర్వాత పోచారం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జనవరి 17వ తేదీ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. పోచారం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ… కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అబ్రహాం, రేఖానాయక్‌, ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, మజ్లిస్‌ శాసనసభ్యుడు అహ్మద్‌ బిన్‌ బలాల.. నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొత్తం ఆరు సెట్ల నామినేషన్లు అందజేశారు. 
జనవరి 18వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. అనంతరం ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ఖాన్‌ స్పీకర్‌ ఎన్నికపై ప్రకటన చేస్తారు. తరువాత స్పీకర్‌ను అభినందిస్తూ సభానాయకులు కేసీఆర్‌, అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రసంగిస్తారు. 
సుదీర్ఘ అనుభవం…
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం.. ఇకపై శాసనసభ వ్యవహారాలను నడిపించనున్నారు. సింగిల్ విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన పోచారం.. అసెంబ్లీ స్పీకర్‌ స్థాయి వరకు ఎదిగారు. 1976 నుంచి రాజకీయాల్లో ఉంటూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పోచారం.. బాన్సువాడ నియోజకవర్గం నుండి ఆరు సార్లు విజయం సాధించారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ దఫా మరో కీలకమైన పదవి చేపడుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. ఆయన అసలు పేరు పరిగె శ్రీనివాసరెడ్డి అయినప్పటికీ.. తాను పుట్టిన ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు పోచారం.