నేడే టి.అసెంబ్లీ ఆఖరు : లాస్ట్ స్పీచ్ కేసీఆర్

  • Publish Date - January 20, 2019 / 01:57 AM IST

నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగంపై చర్చ 
ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు
అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్‌
చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం కొనసాగగా.. జనవరి 20వ తేదీ ఆదివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడనుంది. ఈనెల 17న సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. 
జనవరి 19వ తేదీ శనివారం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ నరసింహన్‌… గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే.. మరోసారి అధికారంలోకి వచ్చామన్నారు. అంతేకాకుండా రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 
ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగాలు…
ఇక గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తొలుత అధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతారు. ఆ తర్వాత పలువురు సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తారు. చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతారు. నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా సీఎం వివరిస్తారు. అలాగే రాబోయే ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నారో కూడా తెలుపుతారు. ఇదిలావుంటే.. గవర్నర్‌ ప్రసంగం అభివృద్ధికి అద్దం పట్టిందన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. సమైక్య రాష్ట్రంలో చేయని పనులను చేసినట్లు గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించేవారని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అయితే.. కాంగ్రెస్‌, బీజేపీ సభ్యులు మాత్రం గవర్నర్‌ ప్రసంగంపై విమర్శలు చేస్తున్నారు. ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క.  గవర్నర్‌ ప్రసంగంపై నేతలు ఎలా స్పందిస్తారనేనది ఆసక్తికరంగా మారింది.