బడ్జెట్‌పై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తెలంగాణ
బడ్జెట్‌పై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. శాఖల వారీగా పద్దుల కేటాయింపులపై అధికారులు లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ తెలంగాణ బడ్జెట్‌పై ప్రభావం చూపించబోతోందంటున్నారు. మరి సీఎం కేసీఆర్ చెప్పబోయే వాస్తవిక బడ్జెట్ ఎలా ఉండబోతోంది?
వాస్తవిక బడ్జెట్:
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో బడ్జెట్ కసరత్తుపై దృష్టి పెట్టింది కేసీఆర్ సర్కార్. ఆర్థిక శాఖ అధికారులతో వరుస సమీక్షలు జరిపారు. సీఎం ఆలోచనలకు తగ్గట్టుగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. అధికారులు రూపొందించిన అంచనాలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఖర్చులు, వ్యయాలను లెక్కలేసుకుంటున్న అధికారులు బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్నారు.
వృద్ధిరేటు 10శాతం:
ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ.. ఊహించినంత ప్రభావం కనిపించ లేదు. అందుకే, ఈసారి వృద్ధిరేటు సుమారు 10 శాతం ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మాంద్యం ప్రభావం ఇంకాస్త తక్కువగా ఉంటుందనేది అంచనా. అందుకే, ఈ బడ్జెట్ సైజ్ 2019తో పోల్చితే 10 నుంచి 12 శాతం అదనంగా ఉండే అవకాశాలున్నాయి. ప్రభుత్వ భూములకు అడ్డంకులు తొలగిపోవడంతో వచ్చే ఏడాది కచ్చితంగా భూమి అమ్మకాల ద్వారా ఖజానాకు రాబడి పెరుగుతుందని అంటున్నారు అధికారులు.
లక్షా 50వేల కోట్ల బడ్జెట్:
ఈసారి లక్షా యాభై వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీనికి అదనంగా భూముల అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ కూడా కలిసి రాబోతోంది. మొత్తానికి వాస్తవ ఆర్థిక పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ రూపకల్పన జరుగుతోందంటున్నారు అధికారులు.