ఫిబ్రవరిలో కేబినెట్ విస్తరణ : 6-8 మందికి ఛాన్స్

  • Publish Date - January 26, 2019 / 03:40 PM IST

మరోసారి తెరపైకి మంత్రివర్గ విస్తరణ
మార్చి తొలివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌!
ఫిబ్రవరిలోగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌!
మార్చితో 16మంది మండలి సభ్యుల పదవీకాలం పూర్తి
నోటిఫికేషన్ వెలువడే లోపే కేబినెట్‌ విస్తరణ
గులాబీ పార్టీలో ఆశావహుల సందడి
ఫిబ్రవరిలో మండలి ఎన్నికల షెడ్యూల్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. కేసీఆర్ తలపెట్టిన సహస్ర చండీయాగం సంపూర్ణమైంది. పంచాయతీ ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే? ఎప్పటిలోగా మంత్రి వర్గ విస్తరణ జరగుతుంది? ఎంత మందికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది? ఇప్పుడిదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి.. నెలన్నర దాటింది. కేసీఆర్‌తోపాటు మహమూద్‌ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు కానీ పూర్తి స్థాయి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఈలోగా అసెంబ్లీ సమావేశాలు, సహస్ర చండీయాగం, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ అంశం మరుగున పడింది. అయితే.. ఇప్పుడు కీలక పనులన్నీ పూర్తి కావడంతో.. మరోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరందుకుంది.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ : 
మార్చి తొలివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఆలోగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌  బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అలాగే మార్చితో 16మంది శాసనసమండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే లోపే కేబినెట్‌ను విస్తరించాల్సి ఉంటుంది.  ఓవైపు కేబినెట్ మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. గులాబీ పార్టీలో ఆశావహుల సందడి మొదలైంది. 

మండలి ఎన్నికలకు షెడ్యూల్ : 
ఫిబ్రవరి మొదటి, రెండో వారంలో మండలి ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెద్దల సభ ఎన్నికల ప్రకటనకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ కుదిరితే ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీలోపు కేబినేట్‌ విస్తరణ ఉంటుందంటూ ప్రభుత్వ, పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తరణ చేపట్టినా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోరని 6 లేదా 8మందికి అవకాశం దక్కొచ్చని అంటున్నారు. లోక్‌ సభ ఎన్నికల తరువాత పూర్తిస్థాయి కేబినేట్‌ కొలువుదీరవచ్చని
భావిస్తున్నారు. 

గణతంత్ర దినోత్సవం వేళ రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రంలో సీఎం కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి మంత్రులు, ఎమ్మెల్సీగా ఎవరెవరికి చాన్స్ దక్కుతుందో.