తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కేబినెట్ శనివారం (నవంబర్ 2, 2019) మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. ఆర్టీసీలో సమూల మార్పులే లక్ష్యంగా మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సుమారు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో… ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రైవేటు ఆపరేటర్ల విషయంలోనా, కార్మిక సంఘాలతో చర్చల విషయంలోనా అన్నది తేలాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీలోకి ప్రైవేట్ బస్సులు, రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గం చర్చించనుంది.
సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను పటిష్టంగా అమలు చేసే అంశం కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానుంది. ఇప్పటికే అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అద్దె బస్సులను అనుమతించేందుకు.. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ తరఫున 10 వేలకు పైగా బస్సులు నడుస్తుండగా అందులో వెయ్యి బస్సులు ప్రైవేటువి. కొత్తగా 4 వేల ప్రైవేటు బస్సులకు అనుమతి ఇస్తే.. సంస్థలో 50 శాతం ప్రైవేట్ బస్సులు అనుమతించేలా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. వీలైనంత త్వరగా ప్రైవేటు బస్సులను రోడ్డు ఎక్కించేందుకు చర్యలు చేపడుతోంది.
ఆర్టీసీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం… ఒకే కార్పొరేషన్‌గా ఉన్న సంస్థను.. నాలుగైదు కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఓ కార్పొరేషన్‌గా మార్చడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి.. కేబినెట్ ఆమోదం తెలిపి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కార్పొరేషన్ విభజన పూర్తవుతుంది.
నవంబర్ నెలాఖరు నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు డీఏ పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధాన్యం సేకరణ, రైతు రుణమాఫీ, రైతుబంధు బకాయిలపై కూడా మంత్రివర్గం చర్చించే చాన్స్ ఉంది. అలాగే.. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. కొత్తగా ఏర్పడ్డ మండల ప్రజాపరిషత్‌ల కోసం 1212 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సమాచార-పౌర సంబంధాల శాఖకు 39 పోస్టుల్ని మంజూరు చేయనుంది. సైబరాబాద్ పరిధిలో గల 20 పోలిస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌తో పాటు.. 1396 పోస్టుల మంజూరుపై నిర్ణయం తీసుకోనుంది కేసీఆర్ కేబినెట్.
ఆర్టీసీ సమ్మె ప్రధాన ఎజెండాగా ఇవాళ్టి కేబినెట్ మీటింగ్ జరుగుతుండగా… ఆర్టీసీ కార్మికుల సమ్మె, కోర్టులో వాదనలతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. దీంతో ఆర్టీసీపై ఇంతకుముందు ప్రకటించిన నిర్ణయానికే కేసీఆర్ కట్టుబడి ఉంటారా.. లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా.. అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్టీసీ భవితవ్యాన్ని తేల్చేందుకు సీఎం ఇప్పటికే పలువురు నిపుణులు,సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు,కేంద్రం అమలు చేస్తున్న రవాణా చట్టంపై కూడా సమగ్ర అధ్యయనం చేశారు. వీటన్నింటిపై కేబినెట్‌తో చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.