కేసీఆర్ టీమ్ రెడీ అయింది. రెండో విడత మంత్రివర్గ విస్తరించారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు రాజ్ భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కేసీఆర్ కేబినెట్‌లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేరుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే… కొత్త మంత్రులు పోర్ట్‌ఫోలియోలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ కేబినెట్‌లో హరీశ్‌రావుకు నీటిపారుదల లేదా ఆర్థిక శాఖ, కేటీఆర్‌కు పట్టణాభివృద్ధి, ఐటీ శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. సత్యవతి రాథోడ్‌కు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పువ్వాడ అజయ్‌కు మైనింగ్ శాఖ కేటాయించే ఛాన్స్ ఉందని… సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ ఇస్తారంటూ జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి.