కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 22 న జనతా కర్ప్యూ కు పిలుపు నిచ్చింది. దీనికి మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో24 గంటల జనతా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతుండగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
ఆదివారం, మార్చి22, సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తర్వాతే 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం ప్రధాన కార్యదర్సితో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం కొరకు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు.
సాయంత్రం 5 గంటలకు ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించిన తర్వాత లాక్‌డౌన్ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. పరిస్థితి రోజు రోజుకీ చేజారిపోతుందన్న అనుమానాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంలోనే లాక్‌డౌన్ ప్రకటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన 75 జిల్లాలను లాక్‌డౌన్ చేయనున్నారు. కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞలు అమలు చేయనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన క్యాబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవాళ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ జిల్లాల్లో నిత్యావసర వస్తువులు మినహా అన్ని సర్వీసులపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే అంతరాష్ట్ర రవాణా సర్వీసులను మార్చి 31 వరకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.
కరోనా కట్టడికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక ప్రధాని పిలుపు మేరకు నేడు (జనతా కర్ఫ్యూ) మెట్రో సర్వీసులను నిలిపేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో, బెంగళూరు మెట్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ రైల్వే కూడా అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.