ఫెడరల్ ఫ్రంట్ మరో ముందడుగు : అమరావతికి కేసీఆర్…

  • Publish Date - January 16, 2019 / 09:27 AM IST

హైదరాబాద్ : మరో ముందడుగు పడింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తూ…ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా దూసుకెళుతున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాన్ని ఫెడరల్ ఫ్రంట్‌లోకి తీసుకరావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అందులో భాగంగా జగన్‌తో భేటీ అయి..చర్చించాలని కేటీఆర్ బృందానికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 16వ తేదీన లోటస్ పాండ్‌లో జగన్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాటం చేస్తామని…25 ఎంపీల సంఖ్యను 42కి చేర్చాలని…త్వరలో అమరావతికి వెళ్లి జగన్‌తో కేసీఆర్ చర్చలు జరుపుతారని కేటీఆర్ ప్రకటించారు. 
అమరావతికి కేసీఆర్…
కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిస్తే లాభం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. నాన్ కాంగ్రెస్ – నాన్ బీజేపీ పరిపాలన రావాలని పిలుపునిచ్చిన కేసీఆర్..వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ అవుతున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలోని ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా స్వాగతించాలని కేసీఆర్ యోచించి…ఆయనతో చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం జరిగిన చర్చలు ఇంకా కొనసాగుతాయని…త్వరలోనే స్వయంగా కేసీఆర్ అమరావతికి వెళ్లి జగన్‌తో భేటీ అవుతారని కేటీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఫ్లాట్ ఫాం మంచిదే అని జగన్ చెప్పడం..ఫ్రంట్‌లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం ఖాయమని తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు కోసం టీఆర్ఎస్ పనిచేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.