Food Safety Raids: హైదరాబాద్ ఫుడ్ ప్రియులకు షాక్.. కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సు సస్పెండ్!
హైదరాబాద్‌లోని 26 కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
- V Santhosh Kumar
- Published on- November 13, 2026 / 06:31 AM IST
Telangana food safety raids on kfc and domino's outlets in hyderabad 9 license suspended
Food Safety Raids: బ్రాండెడ్ ఫుడ్ సెంటర్లలో ఎంతో శుచి, శుభ్రత ఉంటుందని భావించి పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ లాగించే హైదరాబాదీలకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE) అధికారుల తనిఖీలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. నగరంలోని క్యూర్ (CURE) రీజియన్ పరిధిలో ఉన్న ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సంస్థలైన కేఎఫ్‌సీ (KFC), డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ(Food Safety Raids), పోలీసు సిబ్బందితో కూడిన 13 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 26 కేంద్రాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి.
వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల విసర్జనలు.. వాడిన నూనెలో ప్రమాదకర కెమికల్:
ఈ తనిఖీల్లో పలు ప్రముఖ బ్రాంచీలు ఆహార భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు అధికారులు గుర్తించారు. వంటగదులు, స్టోర్ రూమ్‌లలో తీవ్రమైన దుర్వాసన, బొద్దింకలు, ఈగల బెడదతో పాటు ఎలుకల విసర్జనలు, గడువు తీరిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. మరీ ముఖ్యంగా, ఒకసారి వాడిన వంట నూనెను ఫిల్టర్ చేసి మళ్లీ వినియోగించేందుకు అనధికారికంగా ‘మెగ్నీషియం సిలికేట్’ కలుపుతున్నట్లు గుర్తించి 52 కిలోల కెమికల్‌ను సీజ్ చేశారు.
9 అవుట్లెట్ల లైసెన్సులు సస్పెండ్.. మరో 13 బ్రాంచీలకు నోటీసులు:
ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న తీవ్ర లోపాలు ఉన్న 9 అవుట్లెట్ల (మదీనాగూడ, సింధీ కాలనీ, చార్మినార్, మూసారాంబాగ్, బంజారాహిల్స్, శిల్పకళా వేదిక, ఇనార్బిట్ మాల్ కేఎఫ్‌సీలు; శరత్ సిటీ మాల్, ఇనార్బిట్ మాల్ డొమినోస్) FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసి మూసివేశారు. అలాగే 5 బ్రాంచీలకు షోకాజ్ నోటీసులు, 8 బ్రాంచీలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
స్విగ్గీ, జొమాటోల నుంచి తొలగించాలని ఆదేశాలు:
లైసెన్సులు రద్దయిన ఈ 9 అవుట్లెట్ల వివరాలను ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటోలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి లైసెన్సులు పునరుద్ధరించే వరకు ఆయా బ్రాంచీలను తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని (Delist) ఆదేశించనున్నారు.
