చర్చిద్దాం రండి : ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఆహ్వానం

  • Publish Date - September 28, 2019 / 06:53 AM IST

దసరా పండుగకు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా ? లేదా అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని..లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని ఆర్టీసీ కార్మిక ప్రధాన సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దసరాకు ముందుగానే సమ్మెలోకి వెళుతారని ప్రచారం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. చర్చిద్దాం..రండి అంటూ ఆహ్వానించింది. ఇటీవలే కార్మిక శాఖ వాయిదా వేసిన రాజీ సమావేశాన్ని అక్టోబరు 4న నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చించి.. సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. 

దీంతో సమ్మె నోటీసులిచ్చిన సంఘాలకు కార్మికశాఖ లేఖలు రాసింది. అక్టోబర్‌ 4న ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలకు రావాలని లేఖల్లో పేర్కొంది. వాస్తవానికి  సెప్టెంబర్ 23న రాజీ సమావేశాన్ని నిర్వహిస్తామని తొలుత కార్మికశాఖ ప్రకటన చేసింది. కార్మిక సంఘాలు ఆ మీటింగ్‌కు రెడీ అయ్యాయి. కార్మికశాఖ సమావేశం ఉన్నట్టుండి సమావేశాన్ని పోస్టుపోన్డ్ చేసింది. తర్వాత ఎప్పుడు నిర్వహిస్తామన్నది కూడా ప్రకటించలేదు. ఆర్టీసీలోని కార్మిక సంఘాలు సమ్మెకు రెడీ అయిపోయాయి. 

దసరాకు తమ తమ గ్రామాలకు చాలా మంది వెళుతుంటారు. ప్రధాన బస్టాండులన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ఆర్టీసీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతుంటుంది. 3 వేల 500 దాకా ప్రత్యేక బస్సులు నడపడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సమ్మె జరిగితే ప్రయాణికులు ఇక్కట్లపాలవుతారని గ్రహించిన సర్కారు.. రాజీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కార్మికశాఖకు ఆదేశాలిచ్చింది. మరి ఈ సమావేశంలో సమస్యలు పరిష్కారమౌతాయా ? లేక ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళుతారా ? అనేది అక్టోబర్ 04న తేలనుంది.