తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆరు ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. మూడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు మూడు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ఉన్న ఏకైక ఎయిర్ పోర్ట్ శంషాబాద్‌దే. అది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం. తెలంగాణ నుంచి ఎవరైనా ఎక్కడికైనా సరే శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు వెళ్లక తప్పదు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకాక ముందు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ ఉండేది. ప్రస్తుతం అందులోకి కమర్షియల్ విమానాలకు అనుమతి లేదు. వరంగల్ ఎయిర్ పోర్ అయితే మూసేశారు. దీంతో తెలంగాణకు ఒక్కటే ఎయిర్ పోర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రయాణికుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ లో వివిధ ప్రాంతాల్లో ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది.
ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ). తెలంగాణలో ఆరు ప్రాంతాలను గుర్తించగా.. ఆ ప్రదేశాల్లో సాధ్యాసాధ్యాలపై సర్వే చేస్తుంది ఏఏఐ. నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఎయిర్ పోర్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని అద్దకల్, భద్రాద్రి కొత్తగూడెం వద్ద, వరంగల్ జిల్లా మామునూరు, ఆదిలాబాద్ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావించి ప్రతిపాదనలు ఏఏఐకి పంపింది. ఇందుకు అనుగుణంగా భూసేకరణ జరిగింది. నిజానికి బసంత్‌నగర్, మామునూరు, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో చాలా దశాబ్దాల క్రితం విమానాశ్రయాల నిర్వహణ జరిగింది.
ఇప్పుడు ఈ (ఏఏఐ) జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తుంది. ఇందుకోసం హెలికాప్టర్లలో నిపుణులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ జీఐఎస్ మ్యాపింగ్, నియంత్రణ వంటి సమాచారాన్ని సేకరించి నేల స్వభావాన్ని అంచనా వేస్తున్నారు.