టి.ఉద్యోగులకు తీపి కబురు అందేనా : పీఆర్సీ కమిటీ కసరత్తులు

  • Publish Date - January 4, 2019 / 01:11 AM IST

హైదరాబాద్ : నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం… ఉద్యోగుల ఐఆర్‌, ఫిట్‌మెంట్‌ ఇచ్చే దానిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముగ్గురు సభ్యులతో ఇప్పటికే  పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలను మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు, కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆర్థికభారమైనప్పటికీ ఇప్పటికే అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. మరో దఫా ఈ వర్గాలను సంతృప్తి పరిచేందుకు కసరత్తు ప్రారంభించింది.  సీఎం ఆదేశాలతో పీఆర్సీ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకుంటోంది. 
గతంలో 43శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన కేసీఆర్‌
ఈసారి పీఆర్సీపై ఉద్యోగుల భారీ ఆశలు

గతంలో కేసీఆర్‌ 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. దీంతో సీఎం నిర్ణయంపై ఉద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరోసారి వేతన సవరణ జరగబోతున్నందున ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఫిట్‌మెంట్‌ ఖరారు చేసే అవకాశం ఉందనే ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బిస్వాల్‌ కమిషన్‌ను కలిశాయి. పీఆర్సీ పెంపుపై తమ అభిప్రాయాలు పీఆర్సీ కమిటీకి తెలియజేశాయి. 63శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వానికి సిఫారసు చేయాలని పీఆర్సీ కమిటీని కోరాయి.  ఉద్యోగులకు కనీస వేతనం 24వేలు ఉండేలా నిర్దేశించాలని, హెచ్‌ఆర్‌ఏను రెండు స్లాబుల్లోనే అమలు చేయాలని పీఆర్సీ కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచాయి. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ను 61ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేలా చూడాలని పీఆర్సీ కమిటీని కోరినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి త్వరగా ఇవ్వాలని కోరారు. 
బిస్వాల్‌ కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ
63శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరిన ఉద్యోగ నేతలు
కనీస వేతనం రూ. 24వేలకు పెంచాలని డిమాండ్‌
రెండు శ్లాబుల్లో హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాలు
రిటెర్మెంట్‌ను 61 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌

ట్రెండింగ్ వార్తలు