తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. ఫిబ్రవరి నెల నుండే ఎండలు మండుతున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మార్చి 08వ తేదీ శుక్రవారం కూడా ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవుతాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం నుండి కోమోరిన్ వరకు దక్షిణ కోస్తా ఒడిశా, కోస్తాంధ్ర, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. రాగల 3 రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.