లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముహుర్తాలు చూసుకుని మరీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22, 23, 25 తేదీలు మంచి రోజులు కావడంతో… ఆ రోజుల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏప్రిల్ 11కు మరో 23 రోజులే సమయముంది. పార్టీలు అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తుంటే.. టికెట్ కన్ఫాం అయిన క్యాండిడేట్లు ప్రచార వ్యూహాల్లో మునిగిపోయారు.
ఎన్నికల వేళ పార్టీలు, అభ్యర్థులు సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అచ్చొచ్చిన ప్రాంతం, కలసి వచ్చిన ఆలయం.. మంచి రోజు ఇలా అన్నింటినీ చూసుకుంటారు అభ్యర్థులు. నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు ప్రారంభించినా… ముహూర్తాల ప్రకారం 18న ద్వాదశి, 22న విదియ, 23న తదియ, 25న పంచమి మంచి రోజులుగా ఉన్నాయి. దీంతో… ఆ తేదీల్లో ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ విడుదల చేశారు. 25వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. అయితే… ఈనెల 21న హోలీ, 24 ఆదివారం.. సెలవులు కావడంతో ఆ రెండు రోజులూ నామినేషన్లు స్వీకరించరు.
నామినేషన్లు స్వీకరించేందుకు తెలంగాణలో రిటర్నింగ్ అధికారులుగా 16 జిల్లాల కలెక్టర్లను… సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి హైదరాబాద్ జేసీని నియమించారు. అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నామినేషన్‌లను ఆన్‌లైన్‌లోనూ స్వీకరిస్తామంటున్నారు అధికారులు. సువిధ యాప్ ద్వారా నామినేషన్ ఫారం 2ఏ పూర్తి చేసి దరఖాస్తు చేయొచ్చు. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థి అఫిడవిట్‌ను పీడీఎఫ్ కాపీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకుంటుంది.