ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. పోటీకి సై అంటున్నాయి.
ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. పార్టీలన్నీ వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూ.. పోటీకి సై అంటున్నాయి. కొత్త ముఖాలను తెరపైకి తెస్తూనే… సిట్టింగులకు షాకిస్తున్నాయి. కాంగ్రెస్ నంది ఎల్లయ్యకు హ్యాండిస్తే… బీజేపీ దత్తన్నకు నో చెప్పింది. కారు పార్టీ ఏకంగా ముగ్గురు సిట్టింగులకు లిఫ్ట్ ఇవ్వలేదు. లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు గడువుకు చివరి తేదీ సమీపిస్తుండటంతో… తెలంగాణాలో రాజకీయాలు ఊపందుకున్నాయి. వరుసగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ.. పార్టీలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి.
Read Also : నిజామాబాద్‌లో కవిత, మల్కాజిగిరిలో రేవంత్ : భారీగా నామినేషన్లు
ఇప్పటికే కాంగ్రెస్ 16మంది పేర్లు ప్రకటించగా… TRS మొత్తం 17మంది అభ్యర్థులను కన్ఫాం చేసింది. మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. కేవలం 10 మందితోనే జాబితా ఇచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. మూడు ప్రధాన పార్టీలు సీటుపై ఆశలు పెట్టుకున్న వారికి షాకులిచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కొన్ని కొత్త ముఖాలను బరిలోకి దింపాయి. పనిలో పనిగా ఏడుగురు సిట్టింగులకు మరోసారి అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించాయి.
BJP :
బీజేపీ విషయానికి వస్తే.. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ.. బండారు దత్తాత్రేయకు ఈసారి సీటు నిరాకరించింది. 1984 నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న దత్తన్న 4 సార్లు విజయం సాధించారు. వాజ్‌పేయి, మోడీ ప్రభుత్వాల్లో కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. 2014లో మంత్రివర్గంలోకి తీసుకున్న మోడీ.. ఆ తర్వాత రెండేళ్లకే కేబినెట్ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసన పలికారు. ఇప్పుడు ఏకంగా టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన కిషన్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది బీజేపీ.
Congress :
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు గెలుపొందారు. అందులో గుత్తా సుఖేందర్‌రెడ్డి TRSలోకి మారిపోయారు. నాగర్‌కర్నూల్ నుంచి గెల్చిన నంది ఎల్లయ్య ఒక్కరే మిగిలారు. ఇటీవల జాబితా ప్రకటించిన హస్తం పార్టీ… నంది ఎల్లయ్యకు కూడా టికెట్ ఇవ్వకుండా హ్యాండిచ్చింది. ఆయన స్థానంలో షాద్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మల్లు రవికి టికెట్ ఇచ్చింది. మహబూబ్‌నగర్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయి సీనియర్ నేత జైపాల్ రెడ్డి స్థానంలో.. వంశీచంద్‌రెడ్డికి అవకాశమిచ్చింది. మల్కాజిగిరిలోనూ గత ఎన్నికల్లో ఓటమిపాలైన సర్వేను పక్కనబెట్టేసింది. రేవంత్‌రెడ్డిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి ఈసారి ఏకంగా ఎనిమిదిమంది కొత్త వారున్నారు.
TRS :
అధికార పార్టీ TRS అభ్యర్థుల ప్రకటన ఆశావహులకు షాకిచ్చిందనే చెప్పుకోవచ్చు. అంతా ఊహించినట్లే ముగ్గురు నేతలకు కారు లిఫ్ట్ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిపై పార్టీలో వ్యతిరేకత ఉంది. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్‌ను కూడా టీఆర్ఎస్ పక్కనబెట్టేసింది. గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం నుంచి వైసీపీ గుర్తుపై గెల్చిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈసారి టికెట్ ఆశలు పెట్టుకున్నా.. అవి గల్లంతయ్యాయి. గుత్తా మాత్రం పోటీపై ఆసక్తి చూపలేదు. మరి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో చూడాలి.
Read Also : ఏపీ ఎన్నికలు : పోటీలోని కోటీశ్వరులు వీరే