తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి : 26న ఫలితాలు

  • Publish Date - March 22, 2019 / 12:45 PM IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్స్ కోటాలో 17మంది పోటీలో ఉండగా.. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాలకు గాను.. 16మంది పోటీలో ఉన్నారు. 26వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణలో మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ -కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్‌ – ఖమ్మం -నల్గొండ, మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ – కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాలల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.
Read Also : రౌడీ రాజకీయాలపై పవన్ ఫైర్ : తాట తీస్తానంటూ హెచ్చరిక

కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఈసీ అధికారులు పర్యవేక్షించారు. కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి 17 మంది బరిలో నిలవగా.. లక్షా 96 వేల 321మంది పట్టభద్రులుండగా.. 23 వేల 214 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది పోటీ చేయగా… 20వేల 888 మంది ఓటర్లున్నారు. 

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. ఓటర్ స్లిప్పులు అందక ఓట్లు వేసేందుకు వచ్చిన వారు కాస్త ఇబ్బంది పడ్డారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో… ఈ నెల 26న ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్