నగరం ఊరెళ్లిపోతుంది : సంక్రాంతి ‘ఎక్స్‌ప్రెస్’

  • Publish Date - January 6, 2019 / 06:15 AM IST

హైదరాబాద్ : ప్రతీ సంక్రాంతికి నగరం ఊరెళ్లిపోతుంది. ఈ ఏడాదీ సంక్రాంతి పండుగ రానే వస్తుంది. కొద్ది రోజుల్లో ఊరెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్పెషల్ బస్సులతో ఇతర ప్రాంతాలకు వెళ్లే  నగరవాసుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. సంక్రాంతికి నగరం నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణీకులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను  అందుబాటులోకి తీసుకురానుంది.
10 నుండి 14 వరకు…
ఈనెల 10 నుండి 14వ తేదీ వరకు బస్సు సర్వీసులను పెంచబోతున్నట్లు రంగారెడ్డి జిల్లా టిఎస్‌ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. హైదరాబాద్ నగరం నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు 5వేల 252 బస్సులు సిద్ధం చేశారు. నగరంలోని ఎంజీబీఎస్ నుండి 3వేల 400బస్సులు అందు బాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆన్ లైన్ బుకింగ్…
మరోవైపు ఆన్ లైన్ బుక్కింగ్ ద్వారా ఇప్పటి వరకు ప్రయాణికులు 300బస్సుల్లో రిజర్వేషన్ల అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీంతోపాటు  మరో వెయ్యి బస్సులను ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వెసులు బాటును అధికారులు కల్పించనున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా నడిపే స్పెషల్ బస్‌లకు 50శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 
ఇక తెలంగాణలోని వివిధ ప్రాంతాల విషయానికొస్తే 15 వందల92 బస్సులను  ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపబోతుంది. అంతేకాక పండగ రద్దీని దృష్టిలో పెట్టుకొని సిటీ బస్సులను వినియోగించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 400 మెట్రో ఎక్స్ ప్రెస్ , డీలక్స్ బస్‌లను వాడబోతున్నారు.
ఈ నెల 10 నుండి 14 వరకు.
బస్సుల నిర్వాహణకు విస్తృత ఏర్పాట్లు.
ఆన్ లైన్ బుకింగ్ సదుపాయం.
శివారులో ప్రత్యేక ఏర్పాట్లు.

ట్రెండింగ్ వార్తలు