ముంచుకొస్తున్న ముప్పు : వాతావరణంలో మార్పులు

  • Publish Date - May 11, 2019 / 12:53 AM IST

వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే..వానాకాలంలో  సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల  వర్షాలు..కరవు..తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ  సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. వేసవిలో సాధారణం కన్నా 4 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి.

సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలతో తీవ్ర తుఫాన్లు వస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై తక్షణం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరే ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో పొడి వాతావరణ తీవ్రత కూడా క్రమంగా బాగా పెరుగుతోందని..ఇలాంటి వాతావరణం ఉన్న సమయంలో ప్రజలు ఎండలో తిరగవద్దని సూచిస్తోంది. ఇటీవలే ఒడిషాలో తీరం దాటిన ఫోని తుఫాన్ తీవ్ర మార్పులకు కారణమౌతోందని వెల్లడించింది. తుఫాన్ సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా టెంపరేచర్స్ నమోదయ్యాయని..సాధారణం కన్నా 7.1 డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ తెలిపింది.