అతను పోలీస్.. విధి ట్రాఫిక్ క్లియర్ చేయటం. రోడ్డు సంగతి అతనికి అనవసరం. అంతెందుకు ఆ రోడ్డుపై రోజూ తిరిగే వాళ్లకు రోడ్డు ఎలా ఉందన్న సంగతి పట్టలేదు. వాహనదారులు సరేసరి. గుంతలున్నా.. గోతులున్నా అలాగే వెళతారు. వీటన్నింటికీ అతీతంగా, బాధ్యతాయుతంగా ఆలోచించాడు ఆ పోలీస్.
రోడ్డుపై నిలిచిన నీటితో ఇబ్బంది పడుతున్న జనానికి, వాహనదారులకు రిలీఫ్ ఇచ్చారు. తన పని కాకపోయినా పలుగు, పార పట్టారు. అయితే అందులో ఆ వస్తువులు లేకపోవటంతో.. ఓ బొచ్చ పట్టుకుని రోడ్డుపై నిలిచిన నీటిని తోడేశారు ఆ పోలీస్. ఆయన ఎవరంటే తెలంగాణ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాచకొండ నాగమల్లు.
ఒక్కరే ఇలా చేస్తున్నా వాహనదారులు అందరూ చూస్తూనే వెళ్లారు కానీ.. ఎవరూ కూడా పట్టించుకోలేదు. కనీసం ఆగి అతని హెల్ప్ చేయలేదు. ఎవరో వస్తారని, జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి క్లియర్ చేస్తారని ఆ పోలీస్ కూడా అనుకోలేదు. తన బాధ్యత, విధిగా భావించి బొచ్చతో నీటిని తోడేసి.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. హైదరాబాద్ సిటీలో ఈ పోలీస్ చేసిన పనిని ఎవరో సోషల్ మీడియాలో పెట్టగా.. వీడియో వైరల్‌గా మారిపోయింది.