తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్లకు తెర

  • Publish Date - March 25, 2019 / 01:08 AM IST

లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్‌ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్‌ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజుకావడంతో ఏపీ, తెలంగాణలో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్చి 18వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా సెలవులు పోగా 4 రోజులే స్వీకరణ జరిగింది. 21న హోలీ కారణంగా, 23, 24 సెలవులు రావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. 
Read Also : నోరు అదుపులో: ఎన్నికల ప్రచారంలో ఈ పదాలు వాడొద్దు

మ. 3గంటల వరకే నామినేషన్ల స్వీకరణ
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు 220 నామినేషన్లు
నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం

TRS ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులు సైతం ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాలకు నామినేషన్లు వేయాల్సి ఉంది. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి రైతులు బ్యాలెట్‌పోరుకు రెడీ కావడంతో అక్కడ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

ఏపీలో : – 
ఇక ఏపీలోనూ చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే చాన్స్‌ ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. జనసేన, ప్రజాశాంతిపార్టీ పార్టీతోపాటు లెఫ్ట్‌ పార్టీల అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. దీంతో రిటర్నింగ్‌ కేంద్రాల దగ్గర సందడి నెలకొననుంది.

26 నుండి పరిశీలన : – 
నామినేషన్లకు దాఖలు నేటితో పూర్తైతే… మార్చి 26వ తేదీ నుండి నామినేషన్లను అధికారులు పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.  ఏప్రిల్‌ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.

నామినేషన్లు 96కు మించితే  పేపర్‌ బ్యాలెట్‌ 
నిజామాబాద్‌ లోక్‌సభలో 60కి మించిన నామినేషన్లు
నేడు అనుబంధ ఓటర్ల జాబితా

ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అభ్యర్థులు 96కు మించితే  పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈవీఎంలకు బదులు పేపర్‌ బ్యాలెట్‌ను ఈసీ వినియోగించనుంది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు 60కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి.  మరో 40 నామినేషన్లు దాఖలైతే… అక్కడ బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.  మార్చి 25వ తేదీన తెలంగాణలో అనుబంధ ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. 
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు