ప్రపంచకప్ క్రికెట్‌లో ఆడాలనేది ప్రతి ఒక్కరి కోరిక.. అటువంటి అవకాశం ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, తెలంగాణ బిడ్డకు దక్కింది. తెలంగాణ క్రికెటర్ అరుంధతి రెడ్డికి మహిళల టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ అందులో తెలంగాణ అమ్మాయికి చోటు కల్పించింది.
ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న 22 ఏళ్ల హైదరాబాదీ పేసర్ అరుంధతికి ఇదే తొలి ప్రపంచకప్. 2018లో పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అరుందతి, ఇప్పటివరకు 14 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టింది. మిథాలీ రాజ్ తర్వాత ఐసీసీ టోర్నీలో ఆడనున్న తెలుగు క్రికెటర్ అరుంధతినే. టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ర్టేలియాలో జరుగనుంది.
పదిహేను మంది సభ్యుల జట్టులో 16ఏళ్ల బెంగాల్ బ్యాట్స్‌విమన్ రిచా హోష్ మాత్రమే కొత్త ప్లేయర్. ఇటీవల జరిగిన విమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో మెరుపులు మెరిపించిన రిచా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. అలాగే 15ఏండ్ల స్టార్ బ్యాట్స్ విమెన్ షఫాలీ వర్మకు కూడా టీమ్‌లో చోటు దక్కింది.
భారత మహిళల టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, వేద కృష్ణమూర్తి, రాజేశ్వరీ గైక్వాడ్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్, శిఖా పాండే, రాధా యాదవ్.