తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే ఎండలు భగభగలాడిస్తున్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత నెలకొంటోంది. మార్చి 12వ తేదీ మంగళవారం రోజున మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 40 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబి, సంగారెడ్డి జిల్లా ఆందోలు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్లలో 39.8, గద్వాల జిల్లా ధరూరులో 39.7, నిజామాబాద్ జిల్లా బెల్లల్‌లో 39.6, నిర్మల్ జిల్లా వడ్యాలలో 39.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.