మావోయిస్టులు లేరు..కమిషనర్ వ్యాఖ్యలు బాధాకరం – అశ్వత్థామరెడ్డి

  • Publish Date - November 10, 2019 / 07:06 AM IST

ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ప్రతిపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. చలో ట్యాంక్ బండ్ పిలుపులో మావోయిస్టులు లేరు..ఎక్కువ మంది ఆర్టీసీ కార్మికులున్నారని తెలిపారు.

లేనిది తమకు ఆపాదించడం బాధాకరమని, కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. గతంలో జరిగిన మిలియన్ మార్చ్‌లో ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని గుర్తు చేశారు. తాము శాంతియుతంగా గంటపాటు నిరసన వ్యక్తం చేస్తామని తెలిపితే..పోలీసులు నో చెప్పారని..ఇలా చేయడం తగదన్నారు. చలో ట్యాంక్ బండ్ పిలుపులో భాగంగా పోలీసులు ఆర్టీసీ కార్మికులను నిర్బందం చేసి వివిధ పీఎస్‌లకు తరలించారని, ఎంతో మంది గాయపడ్డారని వివరించారు. 

నవంబర్ 09వ తేదీ శనివారం సీపీ అంజనీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అనుబంధ సంస్థలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదని వివరించారు. పోలీసుల నిషేధం ఉన్నా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారని సీపీ ఆరోపించారు. 
Read More : ఆర్టీసీ సమ్మె : నవంబర్ 12 నుంచి నిరవధిక దీక్ష అశ్వత్థామరెడ్డి