సినిమాల్లో చూస్తుంటాం కదా? ముందుగా ఇంట్లోకి పేపర్ అంటూనో.. పాలు అంటూనో.. మంచినీళ్ల కోసం అంటూనో వచ్చి రిక్కీలు నిర్వహించి తర్వాత దొంగతనాలు చేస్తుంటారు. ఇదే మాదిరిగా ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ యువకుడు ఇదే పని చేస్తున్నాడు. అతని వయస్సు 25ఏళ్లు.. అతనిపై ఉన్న కేసులు మాత్రం ఇప్పటివరకు 51.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు వెంకటేష్(25) కూకట్‌పల్లి హైదర్‌గూడలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యసనాలకు బానిసైన వెంకటేష్.. ఉదయం పూట కాలనీల్లో ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తుంటాడు. ఈ క్రమంలో తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తుంటాడు. హాస్టళ్లలో కూడా ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్లు దొంగతనం చేసేవాడు.
ఎల్‌బీనగర్, పేట్‌బషీరాబాద్, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, చందానగర్, జగద్గిరిగుట్టతోపాటు పలు పోలీస్టేషన్‌లో 51 కేసుల్లో నిందితుడు. మాదాపూర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశాడు. అయితే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ వెంకటేష్‌ని ఎట్టకేలకు నిఘాపెట్టి అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు. అతడి నుంచి 40 తులాల బంగారం, బైక్, రూ. 1.17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.